ఉక్కు సంకెళ్లు

రాయదుర్గంలో అంగన్‌వాడీ కేంద్రం తాళాన్ని బలవంతంగా బద్దలు కొడుతున్న సచివాలయ సిబ్బంది

 

అనంతపురం ప్రతినిధి : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన దీక్షపై ప్రభుత్వం ఉక్కు సంకెళ్లతో బంధించే ప్రయత్నం చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను హెల్త్‌ సెక్రటరీల ద్వారా పగులగొట్టించి బలవంతంగా తెరిపించే ప్రయత్నాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేశారు. అనంతపురం నగరంలో బిందెలవారీ కాలనీలోనూ, నార్పల మండల కేంద్రంలోనూ, విడపనకల్లు మండలంలోనూ ఇటువంటి ప్రయత్నాలు చేశారు. వీటిని అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. సత్యసాయి జిల్లాలోనూ ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. నల్లచెరువు, మడకశిర మండలాల్లో తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ అన్ని చోట్ల అంగన్‌వాడీలు అడ్డుకుని మరో తాళాలు వేసి మూసివేశారు. అదే సందర్భంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట 36 గంటల దీక్షను అంగన్‌వాడీలు చేపట్టారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట బైటాయించి అక్కడే వంటా వార్పు చేసుకుని తిన్నారు. రాత్రికి చలిలోనూ నిద్రపోయారు. వీరికి ఆశా వర్కర్లు మద్దతు తెలిపారు. అంతకు మునుపు ఉదయం అనంతపురం మాజీ శాసనసభ్యులు వి.ప్రభాకర్‌ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌లు పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లోనూ టిడిపి, సిపిఎం, సిపిఐ నాయకులు అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించాలని సత్యసాయి కలెక్టర్‌ ఆదేశాలు

అంగన్‌వాడీ కేంద్రాలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి వంద శాతం ప్రారంభించాలని సత్యసాయి జిల్లా కలెక్టరు అరుణ్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి ఐసిడిఎస్‌ పీడీ, ఐకెపి అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడం, అంతుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలివ్వడం పట్ల అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ఎన్నికలకు ముందు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్సు అండ్‌ హెల్పర్సు యూనియన్‌ నాయకులతోపాటు, సిఐటియు రాష్ట్ర నాయకులు జీ.ఓబుళు డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చేస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా కొత్తగా తెచ్చిన యాప్‌ వలన అంగన్‌వాడీలకు సమస్య నెలకొందని చెప్పారు. రిటైర్డుబెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. అలా కాకుండా అణచివేసే ప్రయత్నం చేస్తే అంగన్‌వాడీ వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్దిచెబుతారని హెచ్చరించారు.

సమ్మెపై నిర్బంధాన్ని ఆపాలి : రాంభూపాల్‌

మూడు రోజులుగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెను జిల్లా అధికారులు క్రూరంగా అణిచివేసే చర్యలు, నిర్భందాలు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం పోలీసుల ద్వారా బెదిరింపులు, అధికారుల ద్వారా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టే చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండించింది. అప్రజాస్వామిక చర్యలు ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె శిబిరాల వద్దకు పోలీసులు వెళ్లి నోటీసులు ఇస్తున్నారన్నారు. శుక్రవారం నుంచి సమ్మెలో పాల్గొనరాదని బెదిరించడం సరికాదన్నారు. ఐసిడిఎస్‌ మండల అధికారులు అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను దౌర్జన్యంగా పగులగొట్టి వాలంటీర్ల ద్వారా సెంటర్లు నిర్వహించేందుకు ప్రయత్నించారని తెలిపారు. విడపనకల్లు యాడికి నార్పల తదితర మండలాల్లో పదుల సంఖ్యలో నేడు అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టారని తెలిపారు. సమ్మెను పరిష్కరించాల్సిన ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి సిద్ధపడటం అత్యంత అప్రజాస్వామికమని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అనేక రూపాల్లో నాలుగు నెలలుగా అంగన్‌వాడీ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉద్దేశశ్యపూర్వకంగానే సమ్మె పరిస్థితిని సష్టించి నేడు సమ్మెను అణిచివేయాలని ప్రయత్నించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులతో చర్చలకు పిలిచి ఆర్థిక విషయాలు తప్ప ఇతర విషయాలు మాట్లాడదామని చెప్పడం మోసపూరితంగా ఉందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని కోరారు.

➡️