ఎన్నికల విధులు ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను మినహాయించాలి

ఎన్నికల విధులు ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను మినహాయించాలి

కలెక్టరేట్‌ ఏఓకు విన్నవిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

దీర్ఘకాలిక (క్యాన్సర్‌, గుండె, నరాల, కిడ్నీ మొదలైన రోగాలు) వ్యాధులతో బాధపడు తున్న వారిని, ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని, చంటి బిడ్డ తల్లులను, గర్భవతులైన మహిళ ఉద్యోగ ఉపాధ్యాయులను ఎన్నిక ల విధుల నుంచి మినహాయించా లని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య కోరారు. ఈమేరకు మంగళవారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏఓ జి.అంజన్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వైద్యుల సూచనల మేరకు ఎన్నికల విధుల నుంచి మినహాయించాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయించాలన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వినియోగించుకోనుండంతో ఆలస్యం అవుతుందన్నారు. కావున ఓటర్ల సంఖ్య 800కు మించి ఉండకుండా చూడాలన్నారు. ఒక వేళ ఓటర్ల సంఖ్య 800 కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటే రెండవ పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి తగినంత మంది పోలీసులతో రక్షణ కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్‌స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతలు కాపాడే విధంగా తగినంత మంది పోలీసులను నియమించాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ.వీ.ఎంలను పోలింగ్‌ సిబ్బందికి అందజేయడానికి ముందుగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని బాగా పని చేసే వాటిని పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించాలన్నారు. ఒక వేళ ఈవీఎంలు మురాయించిన ఎడల పోలింగ్‌కు ఆటంకం కలగకుండా వాటిని వెంటనే సరి చేయడానికి టెక్నికల్‌ సిబ్బందిని కూడా నియమించాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌కు తగినంత మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించి వారి కాలకత్యాలు తీర్చుకోనడానికి వాష్‌ రూమ్స్‌ ఉన్న భవనాలను పోలింగ్‌ కేంద్రాలుగా కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సుబ్బరాయుడు, సీనియర్‌ నాయకులు మహమ్మద్‌ జిలాన్‌, మండలాల నాయకులు శేషప్ప, గంగాధర్‌, సంపత్‌ కుమార్‌, చంద్రమోహన్‌, శ్రీనివాసులు, ఆదిశేషయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

➡️