‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’కు పకడ్బందీగా ఏర్పాట్లు

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

 

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఎం.గౌతమి వివరించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జిల్లా ప్రబరి ఆఫీసర్‌ సడ్చీంద్రకుమార్‌ పట్నాయక్‌, ఐఆర్‌ఎస్‌ఎస్‌ (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, జాయింట్‌ సెక్రెటరీ ఈక్వివాలెంట్‌) వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహణ ఏర్పాట్లుపై అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాస్థాయి, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పంచాయతీ అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 25 నుంచి జనవరి 24వ తేదీ వరకూ జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న యల్లనూరు మండలం కూచివారిపల్లి, బొప్పేపల్లి గ్రామాల్లో, కుందుర్పి మండలంలోని అప్పిలేపల్లి, కరిగానిపల్లి, గుత్తి మండలంలోని బసినేపల్లి, బసినేపల్లి తండా, కణేకల్‌ మండలంలోని బ్రహ్మసముద్రం, బెనికల్‌, గుంతకల్లు మండలంలోని కంగనపల్లి, ఓబులాపురం గ్రామాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదయం ఒక గ్రామం, మధ్యాహ్నం ఒక గ్రామంలో యాత్ర ఉంటుందన్నారు. జిల్లాకు రెండు వ్యాన్లు రాగా గుంతకల్లు మండలంలోని కొంగణపల్లి, ఓబుళాపురం గ్రామాలకు ఒకవ్యాన్‌, కుందుర్పి అప్పిలేపల్లి, కరిగానిపల్లి ఒక వ్యాన్‌ను పంపినట్లు తెలిపారు. మరో మూడు వ్యాన్లు రావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమం కోసం ఎంపిడిఒలను ఇన్‌ఛార్జిలుగా నియమించినట్లు వివరించారు. జిల్లాలో సజావుగా వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. అనంతరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జిల్లా ప్రబరి ఆఫీసర్‌ సచ్చీంద్రకుమార్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహించేందుకు కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిపిఓ ప్రభాకర్‌రావు, సిపిఓ అశోక్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి, ఎఎల్‌ఎం సత్యరాజ్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నాగరాజ్‌, సోషల్‌ వెల్ఫేర్‌ జెడి మధుసూదన్‌రావు, డిటిడబ్ల్యూఓ అన్నాదొర, డిఇఒ నాగరాజు, బీసీ వెల్ఫేర్‌ డీడీ కుష్బూకొఠారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️