వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
2023 ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే బీమా సొమ్ము ప్రకటించాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రైతుసంఘం ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డి, తాటిచెర్ల సచివాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2023 ఖరీఫ్, రబీలో సీజన్లలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు భారీగా నష్టపోయారన్నారు. అప్పటి ప్రభుత్వం ఖరీఫ్‌లో 25 మండలాలు, రబీలో 14 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదన్నారు. కావున పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. వీటితోపాటు హెచ్‌ఎల్‌సి నీరు విడుదల చేయాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల నాయకులు సుదర్శన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తిరుపాల్, గంగాధర్, నాగేంద్ర, రఘరాములు, తాటిచెర్ల గ్రామ రైతులు వెంకట్రామిరెడ్డి, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం : జిల్లాలో అతివృష్టి, అనావృష్టి కారణాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంతోపాటు రెడ్డిపల్లి, కొర్రపాడు సచివాలయాల్లో ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.శివారెడ్డి, కుళ్లాయప్ప, రైతుసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకట కొండ, డి.శ్రీనివాసులు, రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు సంజీవరెడ్డి, చిన్న పుల్లయ్య, కొర్రపాడు నారాయణస్వామి, రెడ్డిపల్లి నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.