శింగనమలలో వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-శింగనమల
2023 ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలుసాగు చేసి నష్టపోయిన రైతులకు వెంటనే బీమా పరిహారాన్ని ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రూ.20వేలు ఇవ్వాలని, 2023 ఖరీఫ్, రబీ బీమా ప్రకటించాలని, సమగ్ర ఉచిత పంటల బీమా అమలు చేయాలని, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, రెండు లక్షల వరకూ రైతు రుణాలు రద్దు చేయాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించొద్దని, ప్రభుత్వమే టమోటా మార్కెట్‌ను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని, భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అన్ని రకాల ఎరువులు, పురుగు మందులను రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి కొండారెడ్డి, బాలరాజు, ఓబులేసు, శ్రీనివాసులు, సుంకన్న, ఓబిరెడ్డి, ఆంజనేయులు, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
యల్లనూరు : రైతులకు పెట్టబడి సాయం రూ.20వేలు ఇవ్వాలని, 2023 ఖరీఫ్, రబీ పంటల బీమాను వెంటనే ప్రకటించాలని సిపిఎం, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని కార్యాలయంలో తహశీల్దార్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సూర్యనారాయణ, రమేష్, రైతుసంఘం నాయకులు ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.
రాప్తాడు : రైతులకు పెట్టుబడి సాయం వెంటనే అందించాలని కోరుతూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల నాయకులు ఎం.పోతులయ్య, బి.సుబ్బారెడ్డి, బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎ.ఎర్రిస్వామి, దండు శ్రీనివాసులు, వై.లక్ష్మీనారాయణ, కె.నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.