ర్యాలీ నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు
ప్రజాశక్తి-కళ్యాణదుర్గంరూరల్
పోరాటాలు చేయడం ద్వారానే హక్కులను సాధించుకుంటామని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల, ఎపి రైతుసంఘం జిల్లా నాయకులు బిహెచ్.రాయుడు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్‌ప్రసాద్ అధ్యక్షతన పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందు కార్మికులు పోరాడి సాధించుకున్న దాదాపు 29 కార్మిక చట్టాలు, నాలుగు లేబర్ కోడ్‌లుగా కేంద్రం ప్రభుత్వం మార్చిందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికులను బానిసలుగా చేసేందుకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. చేసేదిలేక నేడు దేశవ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు చేయాల్సి వచ్చిందన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు-2022ను రద్దు చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని, 200రోజులకు ఉపాధి హమీ పథకం పని దినాలు పెంచాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చేయాలని, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని, శ్రీరామిరెడ్డి, సత్యసాయి కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వాలని కోరారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ ఎఒ ఎన్.ఈశ్వరయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మల్లికార్జున, రంగనాథ్, రఘు, రాము, రామచంద్ర, శివ, వన్నూర్, మేరీ, గోవిందమ్మ, రాధ, లావణ్య, రామంజమ్మ, విజయనిర్మల, తిప్పీరమ్మ, పాతక్క, రాధ, రామచంద్ర, ఈశ్వర్, రైతుసంఘం నాయకులు మల్లికార్జున, అరవింద్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ, వంశీ, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్, హామాలీ, శ్రీరామిరెడ్డి, సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు.