డెంగీ మరణాలు లేకుండా చర్యలు : కలెక్టర్‌

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ డా||వినోద్‌కుమార్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో డెంగ్యూ వ్యాధితో ఏ ఒక్క చిన్నారీ మరణించకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో మలేరియ కార్యాచరణ ప్రణాళిక, డెంగ్యూ జ్వరంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ నెల ప్రపంచ మలేరియా నెల అన్నారు. ఇందుకు సంబంధించి రోజువారీగా క్యాలెండర్‌ సిద్ధం చేసి వివరాలు అందించాలన్నారు. క్యాలెండర్‌ ప్రకారం అన్ని పనులు చేపట్టాలన్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో చిన్నారులు ఎవరూ డెంగ్యూతో చనిపోరాదన్నారు. డిఎంహెచ్‌ఒ, డిసిహెచ్‌ఎస్‌, జిల్లా మలేరియా అధికారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అందరూ కలిసికట్టుగా పనిచేసి మలేరియ, డెంగ్యూ వ్యాధులను అరికట్టాలన్నారు. ఎవరికైనా డెంగ్యూ వ్యాధి సోకినా తక్షణమే చికిత్స అందించాలని తెలియజేశారు. ప్రయివేటు హాస్పిటల్స్‌తో కూడా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విస్తతస్థాయిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దోమల నివారణకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఫాగింగ్‌, ఫ్రైడే డ్రైడే యాక్టివిటీలు, ఆయిల్‌ బాల్స్‌ వేయడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, తదితర అంశాలపై వివరణాత్మకంగా కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, డిఎఫ్‌ఒ వినీత్‌ కుమార్‌, డిఎంహెచ్‌ఒ డా||ఈబి.దేవి, డిసిహెచ్‌ఎస్‌ పాల్‌ డా||రవికుమార్‌, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డా||కిరణ్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ఓబులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా||వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ ఆర్డీ పివివిఎస్‌.మూర్తి, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి, సోషల్‌ వెల్ఫేర్‌ జెడి మధుసూదన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️