భూసమస్యల పరిష్కారానికి చర్యలు

ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

భూసమస్యలు పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డా||వి.వినోద్‌ కుమార్‌ తెలియజేశారు. అనంతపురం నగరంలోని ఆల్‌ఇండియా రేడియో స్టేషన్‌లో గురువారం ఉదయం ఆకాశవాణి అనంత మిత్ర ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో భూ సమస్యలపై జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మతో కలిసి నేరుగా ప్రజలకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చుక్కల భూమికి చుక్కలు తొలగించి పట్టాదారు పేరు మీద ఎక్కించడం ఒక సేవ అని, అక్కడ దరఖాస్తు చేసుకోవాలన్నారు. తహశీల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలన అనంతరం కలెక్టర్‌కి వస్తుందన్నారు. ఈ సేవ కోసం సచివాలయం, మీ సేవలో దరఖాస్తు చేయాలన్నారు. కొత్త భూములు ఏది రిజిస్ట్రేషన్‌ చేయకూడదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వెబ్‌ ల్యాండ్‌ ఆన్లైన్‌ పోర్టల్‌లో భూమి గురించి అన్ని వివరాలు ఉంటాయని, అందులో పకడ్బందీగా మార్పు చేర్పులు చేయడానికి వీలులేదన్నారు. భూమి, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఏ.మలోల, ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

➡️