పోస్టర్లను విడుదల చేస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్, అధికారులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
జిల్లా రైతులను ప్రోత్సహించేందుకు ఈనెల 5వతేదీన అనంతపురంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ఎంవైఆర్ కన్వెన్షనల్ హాల్‌లో నిర్వహించనున్న అనంత ఉద్యాన సమ్మేళనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూభవన్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా పిలుస్తామని, ఇక్కడ ఉద్యాన పంటల సాగుకు విపరీతమైన అవకాశం ఉందన్నారు. జిల్లాలో పండిస్తున్న అరటి, మామిడి, చీనీ తదితర పంటలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. జిల్లాలో 1,04,021 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయన్నారు. 25.96 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పాదకత ఉందన్నారు. ఉద్యాన పంటల సాగులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లా జివిఎలో 45 శాతం వాటా ఒక్క ఉద్యాన ఉత్పతులు ద్వారా వస్తోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్‌డిపిలో 11.73 శాతం వాటా అనంతపురం జిల్లా అందిస్తోందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లాలు ఎక్కడ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ప్రణాళికను రూపొందించారని తెలిపారు. ఆ ప్రక్రియలో జిల్లాలో 5 గ్రోత్ ఇంజన్స్‌ను గుర్తించామన్నారు. జిల్లా 17శాతం అభివృద్ధిని రాబోయే 5 సంవత్సరాల్లో చేయొచ్చన్నారు. జిల్లాలో అరటి, ఎండుమిరప, బత్తాయి, టమోటా, మామిడిపండ్లను జిల్లా ఉద్యాన గ్రోత్ ఇంజన్స్‌గా గుర్తించామన్నారు. రాష్ట్ర, దేశస్థాయితో పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో జాతీయస్థాయి కాంక్లేవ్‌ని ఏర్పాటు చేశామన్నారు. నెల రోజులుగా ఈ కార్యక్రమంపై కసరత్తు చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీజీ.భరత్ వర్చువల్‌గా పాల్గొంటారని, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును ఆహ్వానించామన్నారు. అగ్రికల్చర్, కోపరేటివ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఫ్రొగ్రామ్ మెంటార్‌గా ఉంటారన్నారు. లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్‌మెంట్, ఫ్రీ హార్వెస్ట్, హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్ ఈ మూడు స్థాయిలో కూడా చివరి వరకు టైఅప్ చేయమని ముఖ్యమంత్రి చెప్పారని, ప్రతి దాంట్లో ప్రోడక్ట్ ఫర్ఫెక్షన్ తీసుకోవచ్చని, గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలంటే నాణ్యత అవసరమన్నారు. ఇప్పటికే జాతీయస్థాయిలో 64 కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని, అందులో 6 పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) తీసుకుంటున్నామన్నారు. అనంతపురం జిల్లా ఉద్యాన ఉత్పత్తులను బ్రాండింగ్ చేయడం, ప్రచారం కల్పించడం, కోల్డ్ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, మార్కెట్లో పోటీతత్వం పెంచడం, రైతులకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో అవగాహన పెంపొందించడం, రెండింతలు ఆదాయం రైతుకు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్‌ఓ ఏ.మాలోల, హార్టికల్చర్ డిడి నరసింహారావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, హార్టికల్చర్ అధికారి పల్లవి తదితరులు పాల్గొన్నారు.