మెరుగైన వైద్యసేవలు అందించాలి

రోగులలో మాట్లాడుతున్న డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వి.పాల్‌ రవికుమార్‌

ప్రజాశక్తి-ఉరవకొండ

వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకపోతే చర్యలు తప్పవని డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వి.పాల్‌ రవికుమార్‌ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని స్థానిక వైద్యాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ల్యాబ్‌, ఒపికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తర్వాత చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి సరైన చికిత్స చేస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. స్నేహపూర్వకంగా మెలిగి వైద్యం అందించాలన్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి రక్త పరీక్షల కోసం ప్రయివేటు పరీక్ష కేంద్రాలకు పంపరాదన్నారు. అన్నిరకాల పరీక్షలు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నప్పటికీ ప్రయివేటు సెంటర్లకు ఎందుకు పంపుతున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపోతే హెచ్‌ఎంపివీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎవరూ భయాందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే రూపుమాపుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు చౌదరి, గంగాధర్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️