ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలుగా తీరని ద్రోహం చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప విమర్శించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి ఏ మొహం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, ప్రధాని మోడీ పర్యలనకు నిరసనగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసనలో ఓ.నల్లప్ప మాట్లాడుతూ 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారన్నారు. విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను రూ.20 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో, ప్రత్యక్షంగా 25 వేలు, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తామని చెప్పారన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ మాటలు చెప్పి ఇప్పుడు కడప ఉక్కు మా పరిశీలనలేదని చేతులెత్తేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల ఊతకర్రల సహాయంతో మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోందంటే అందుకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలే కారణం అన్నారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సుమారు రెండు సంవత్సరాలుగా కార్మికులు, ప్రజలు పోరాడుతున్న విశాఖపట్నానికి ప్రధాని మోడీ రావడం ఆంధ్రులను అగౌరపరచడమే అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పి ఆంధ్రలో ప్రధాని పర్యటించడం తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు, బొగ్గు గనులు కేటాయించకుండా ఆ ప్రాంతంలోనే మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ఆలోచన చేయడం ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు ఏడు జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ప్రకటించి మూడు సంవత్సరాల మాత్రమే ఇచ్చారన్నారు. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు. రాయలసీమ ప్రాంతానికి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. జిల్లాలో ఖనిజ వనరుల ఆధారంగా పరిశ్రమలు, విద్యాభివృద్ధికి యూనివర్సిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నారు. ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందిన రాయలసీమలో శీతల గిడ్డంగులు మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. రైతాంగ ఆత్మహత్యలను నివారించి, చేనేత కార్మికులను వత్తిదారులను అదుకోవాలని డిమాండ్ చేశారు. వీటిన్నంటిపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖలో పర్యటిస్తున్న సందర్భంగా స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయాలన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం మోడీపై ఒత్తిడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.నాగేంద్ర కుమార్, బాలరంగయ్య, సావిత్రమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మన్నీల రామాంజనేయులు, ముర్తుజా, వెంకటనారాయణ, పరమేష్, నాగరాజు, నగర కమిటీ సభ్యులు ప్రకాశ్ రెడ్డి, వలి, ఇర్ఫాన్, ఆటో శీనా, ఓబులేసు, మండల కార్యదర్శులు చెన్నారెడ్డి, పోతులయ్య పాల్గొన్నారు.