ఉడేగోళం వద్ద రోడ్డు పనులకు వేసిన నల్ల మట్టి
ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్
మండలంలోని 74-ఉడేగోళం గ్రామం వద్ద చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసిరకంగా చేపడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వివరాలు.. రూ. 13 కోట్ల వ్యయంతో 74-ఉడేగోళం సమీపంలోని మధ్యానేశ్వరస్వామి ఆలయం ఆర్చి నుంచి గుమ్మగట్ట మండలంలోని కొత్తపల్లి వరకూ రెండు వరుసల బిటి రోడ్డు వేసేందుకు ద్వారకామయి కన్‌స్ట్రక్షన్స్(డిఎంసి) పనులు చేపట్టింది. అయితే నిర్మాణ సమయంలో కేవలం అర అడుగు లోతు మాత్రమే మట్టి తవ్వి రోడ్డు వేస్తున్నారని, ఎర్రమట్టికి బదులుగా నల్ల మట్టిని ఉపయోగిస్తున్నారు. దీంతో రాయంపల్లి సమీపంలో ఉన్న గవి సిద్దేశ్వర ఫ్యాక్టరీకి ఇనుము ముడి సరుకు తీసుకెళ్లే రెండు లారీలు గత బుధవారం నల్ల మట్టిలో ఇరుక్కుపోయాయని లారీల డ్రైవర్లు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు పనులను పర్యవేక్షించి నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బి అధికారులను వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.