నేమకల్లులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న విప్ కాలవ శ్రీనివాసులు
ప్రజాశక్తి-రాయదుర్గం
ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామానికి రానున్నారు. పింఛన్ల పంపిణీ, గ్రామసభల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధికారులతో కలిసి మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం నేమకల్ వద్ద హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలల్లోపే ముఖ్యమంత్రి పూర్తిగా వెనుకబడిన రాయదుర్గం నియోజకవర్గానికి రావడం ఇక్కడి ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. 2014-19 కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుప్పం కంటే రాయదుర్గం నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చి ఈ ప్రాంత అభివద్ధికి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. ఈ ప్రాంత ప్రజల అభివద్ధి, అంకితభావానికి ఐదేళ్ల కాలంలో మంజూరు చేసిన పనులు కొన్ని పూర్తికాగా, కొన్ని అర్ధాంతరంగా ఆగాయన్నారు. ఆగిన కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించడంతోపాటు కొత్తగా నియోజకవర్గానికి తీసుకురావాల్సిన అభివద్ధి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివద్ధి, సర్వతోముఖాభివద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, లక్ష ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం నెరవేర్చేందుకు సీఎం రాయదుర్గం నియోజకవర్గం పర్యటనను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. కొత్త వరాలు కోరుకుని నియోజకవర్గాన్ని అభివద్ధి పథం వైపు తీసుకెళ్తానని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు.