‘సామ్‌సంగ్‌’కు కార్మిక చట్టాలు పట్టవా..? : సిఐటియు

అనంతపురంలో సామ్‌సంగ్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

సామ్‌సంగ్‌ బహుళ జాతి సంస్థ యాజమాన్యం భారతదేశ కార్మిక చట్టాలను గౌరవించదా అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ ప్రశ్నించారు. సిఐటియు జాతీయ కమిటీ పిలుపుమేరకు తమిళనాడు పెరంబదూర్‌ సామ్‌సంగ్‌ ప్లాంట్‌ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురం సప్తగిరి సర్కిల్‌ లలితకళా పరిషత్‌ సామ్‌సంగ్‌ షోరూమ్‌ వద్ద ధర్నా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ తమిళనాడు పెరంబదూర్‌ ప్రాంతంలోని సామ్‌సంగ్‌ పరిశ్రమలో గత కొన్ని నెలలు నుంచి 2 వేల మంది కార్మికులు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు సెప్టెంబర్‌ 9 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి సంస్థ సామ్‌సంగ్‌ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు, భారత రాజ్యాంగాన్ని, కార్మిక చట్టాలను గౌరవించాలన్నారు. రాజ్యాంగం ప్రకారం కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును గుర్తించాలన్నారు. పని వేళలు మార్చాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పిఎఫ్‌,ఈఎస్‌ఐ చట్టాలను అమలు, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేదాకా జరిగే ఈ సమ్మెకు దేశవ్యాప్తంగా కార్మికులందరూ మద్దతు తెలియజేస్తారన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు విదేశీ బహుళజాతి కంపెనీ సామ్‌సంగ్‌ భారత కార్మికులపై వ్యవహరిస్తున్న అనాగరిక చర్యలను ఖండించాలన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకునేలా, కార్మిక చట్టాల అమలు కోసం సామ్‌సంగ్‌ యాజమాన్యాన్ని ఆదేశించాలని సెలవిచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటనారాయణ, బండారు ఎర్రిస్వామి, తిరుమలేష్‌, నాగరాజు, ఆజాం బాషా, భాస్కర్‌, జిలాన్‌ బాష, శ్రీనివాస్‌ మూర్తి, కుమార్‌, హరి, పెద్ద కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

➡️