నాణ్యమైన వైద్యసేవలు అందించాలి : కలెక్టర్‌

వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ తెలియజేశారు. నగరంలోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, సిడి ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రులు, జిజిహెచ్‌ రక్తనిధి కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీని తనిఖీ చేసి, రోజుకు ఎంతమంది రెడ్‌ క్రాస్‌ నుంచి రక్తం తీసుకు వెళుతున్నారు, మౌలిక సదుపాయాలు, టెక్నికల్‌ సిబ్బంది ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ హోమియో వైద్యశాలను తనిఖీ చేసి మందులు సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై అక్కడున్న రోగులతోనూ మాట్లాడారు. సిడి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసుపరతికి రోజుకు 300 నుంచి 400 మంది రోగులు వస్తున్న నేపథ్యంలో అవసరమైతే మరింత మంది డాక్టర్లను నియమిస్తామన్నారు. శారద నగర్‌లో ఉన్న క్యాన్సర్‌ యూనిట్‌ను తనిఖీ చేసి వైద్య సేవలు, సదుపాయాల కల్పనపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిజిహెచ్‌)లోని రక్తనిధి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డా||ఈబి.దేవి, డిసిహెచ్‌ఎస్‌ పాల్‌ రవికుమార్‌, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా||వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఒ హేమలత, ఆర్‌ఎంవో పద్మజ, డ్రగ్స్‌ ఏడీ రమేష్‌ రెడ్డి, రెడ్‌ క్రాస్‌ వైస్‌ ఛైర్మన్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌తో పాటు వైద్యులు పాల్గొన్నారు.

➡️