పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోండి : కలెక్టర్‌

విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని సంబంధిత ఓటర్లు అందరూ ఉపయోగించుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని అనంతపురం కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌కుమార్‌ తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సాధారణ ఎన్నికలు – 2024కు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌, సర్వీస్‌ ఓటర్లపై పలు విషయాలను వెల్లడించారు. ఎన్నికలలో పోస్టల్‌ బ్యాలెట్‌ కీలకమైన ప్రక్రియ అన్నారు. ఉద్యోగస్తులు వేరే వేరే చోట పనిచేస్తుంటారని, మే 13వ తేదీన పోలింగ్‌ రోజున ఉద్యోగులు వారి పేరు ఏ పోలింగ్‌ స్టేషన్లో ఉన్నదో అక్కడ వెళ్లి ఓటు వినియోగించలేకపోవడం వల్ల ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతిని ప్రవేశపెట్టిందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది అందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఫామ్‌ 12డి హోమ్‌ ఓటింగ్‌ వారు వారి ఆప్షన్‌ ఇవ్వడానికి మంగళవారం చివరి రోజు అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ కు సంబంధించి ఎలాంటి సందేహం ఉన్న జిల్లా, అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లకు ఫోన్‌ చేసి ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు. హోమ్‌ ఓటర్లు 85పిడబ్ల్యూడి, ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లు ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వర్తిస్తుందన్నారు. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్ల పైబడిన ఓటర్లు 9,828 మంది ఉన్నారని, అందులో 611 మంది హోం ఓటింగ్‌ ను ఎంచుకున్నారన్నారు. పిడబ్ల్యూడి ఓటర్లు 26,097 మంది ఉండగా, 693 మంది హోం ఓటింగ్‌ను ఎంపిక చేసుకున్నారన్నారు. సర్వీస్‌ ఓటర్లు 2,115 మంది ఉన్నారన్నారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో మొత్తం 23,900 మంది ఉండగా, జిల్లాలో ఫామ్‌ 12 సమర్పించిన వారు 10,582 మంది ఉన్నారన్నారు. ఇతర జిల్లాల నుంచి ఫామ్‌ 12 ఇచ్చినవారు 888 మంది ఉన్నారని, మొత్తం కలిపి 11,470 మంది ఫామ్‌ 12 అందజేశారన్నారు. ఎన్నికల్లో అత్యవసర సేవలు అందించే 33 శాఖలకు సంబంధించి 2,681 ఫామ్‌ 12డి జారీచేయగా, అందులో 651 మంది నుంచి ఫామ్‌ 12డిని స్వీకరించినట్లు తెలియజేశారు. ఇతర జిల్లాల నుండి ఫారం 12 అందుకోవడానికి ఈ నెల 26వ తేదీ చివరి గడువు అన్నారు. రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ ఫేస్‌ ఎక్స్చేంజ్‌ కు ఏప్రిల్‌ 28, సెకండ్‌ ఫేస్‌ ఎక్స్చేంజ్‌ మే 3వ తేదీ చివరి గడువు అన్నారు. ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నిర్వహణకు చివరి తేదీ మే 8వ తేదీ అన్నారు. రాష్ట్రస్థాయిలో మూడవ ఫేస్‌ ఎక్స్చేంజ్‌కు మే 10 చివరి తేదీ అన్నారు. ఫారమ్‌ 12డి పంపిణీ, స్వీకరించడానికి షెడ్యూల్‌ కు సంబంధించి ఈనెల 23వతేదీ చివరి తేదీ అన్నారు. హోమ్‌ ఓటింగ్‌ షెడ్యూల్‌ మే 5న ప్రారంభం అయ్యి 9న ముగిస్తుందన్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, వీడియో గ్రాఫర్లకు సంబంధించి ఫెసిలిటేషన్‌ సెంటర్లు మే 5వ తేదీ ప్రారంభమై 7వ తేదీన ముగుస్తాయన్నారు. పోలీస్‌ పర్సనల్స్‌ కి సంబంధించి మే 6వ తేదీ, మే 8వ తేదీ ఫెసిలిటేషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యవసర సేవలకు సంబంధించి పోస్టల్‌ ఓటింగ్‌ సెంటర్‌ మే 8, 10వ తేదీన షెడ్యూల్‌ ఉందన్నారు. పోలింగ్‌ పర్సనల్స్‌ కి సంబంధించి రెండో విడత శిక్షణ మే 3, 4వ తేదీన, మూడో విడత శిక్షణ మే 12న నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈవీఎంల కమిషనింగ్‌ను మే 3వ తేదీన, మే 7వ తేదీన షెడ్యూల్‌ చేయనున్నట్లు తెలియజేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, డీపీవో ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.

➡️