ఐక్యతను చాటుతూ జెసి ప్రభాకర్‌ రెడ్డి వేడుక నిర్వహించడం హర్షనీయం సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప

ప్రజాశక్తి తాడిపత్రి

న్యూ ఇయర్‌ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌ రెడ్డి కులాలు, మతాలకు అతీతంగా ఐక్యతను చాటుతూ నిర్వహించిన మహిళా వేడుక హర్షించదగ్గ విషయమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప పేర్కొన్నారు. తాడిపత్రిలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా మహిళా కార్యక్రమం చేపడితే హర్షించాల్సిన బిజెపి విమర్శలకు దిగడం సరైనది కాదన్నారు. కులాలు, మతాలకు దూరంగా ప్రజలందరూ ఐక్యం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. వివిధ మతాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడితే దీనిపై బీజేపీ అనుబంధ సంఘాలు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. బిజెపికి మతాన్ని రాజకీయంతో ముడి పెట్టడం అలవాటుగా మారిందన్నారు. మత ఉన్మాదానికి రాజ్యాంగంలో ఎక్కడా అవకాశం లేదన్నారు. బిజెపి మత రాజకీయాలు చేయడాన్ని సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలతో పాటు లౌకికవాదానికి మద్దతుగా చెప్పినటువంటి వారి మీద ఇలాంటి దాడులకు తెగబడడం సరైనది కాదన్నారు. ప్రభాకర్‌ రెడ్డి బస్సులు దహనంలో బిజెపి పాత్ర ఉందని ప్రభాకర్‌ రెడ్డి చెప్పారని, ఆ మేరకు దీనిపై సమగ్ర విచారణ చేపట్టిచట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక మత ఉన్మాదం పెచ్చి మీరే ప్రమాదం ఉందన్నారు. లౌకికక వాదానికి మద్దతుగా మాట్లాడే వారందరికీ ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.నాగేంద్ర కుమార్‌, నాయకులు జగన్మోహన్‌ రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

➡️