ఎండిన పంటలను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-రాప్తాడు
ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ వర్షాభావంతో పూర్తిగా చేతికందకుండా పోయాయని, ప్రభుత్వం స్పందించి రైతులకు అన్ని విధాలా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. రాప్తాడు మండల కేంద్రంలో రైతు పామల్ల కొండప్ప, ఇతర రైతులు సాగు చేసిన వేరుశనగ పంటలను శనివారం నాడు సిపిఎం నాయకులు పరిశీలించారు. ఏడు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేస్తే వర్షాభావంతో పూర్తిగా ఎండదశకు చేరుకుందని రైతు కొండప్ప సిపిఎం నాయకుల ఎదుట వాపోయాడు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశానని, ప్రస్తుతం ఇదంతా నష్టపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ వర్షాభావంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటలను కూడా రైతులను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. వేరుశనగ పంటకు దాదాపు రైతులు ఎకరాకు రూ.30 నుంచి రూ.35 వరకు ఖర్చు చేశారన్నారు. వర్షాభావంతో దిగుబడి రాక ఈ పెట్టుబడులు మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.పోతులయ్య, జిల్లా కమిటీ సభ్యుడు టి.రామాంజనేయులు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు కదిరప్ప, రైతులు సుబ్బిరెడ్డి, వెంకట్రాముడు, గాండ్లపర్తి పోతులయ్య, జి.వెంకట రాముడు పాల్గొన్నారు.