అన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించండి : సిపిఎం

జిల్లా రైతులను ఆదుకోవాలని వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

అనంతపురం జిల్లాలోని 31 మండలానూ కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఎం, రైతుసంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యదర్శి వర్గ సభ్యులు బాలరంగయ్య, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి.రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు పోతులయ్య, డేవిడ్‌లు కేంద్ర కరువు బృందం సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం అతివృష్టి, అనావష్టితో రైతులు అన్ని రకాల పంటలను తీవ్రంగా నష్టపోయారన్నారు. పెట్టుబడులు కూడా చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాకు 10 వేల కోట్ల కరువు ప్యాకేజీని ప్రకటించి రైతుల అప్పులు మాఫీ చేయాలన్నారు. పంటసాగుచేసి నష్టపోయిన రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా గరిష్టంగా 4 హెక్టార్ల వరకు పరిహారం అందించా లన్నారు. వర్షాభావం వల్ల విత్తనం వేయని రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని, రోజుకు రూ.600 వేతనం చెల్లించి వలసలను ఆపాలన్నారు. పట్టణాల్లోనూ జాతీయ ఉపాధి పనులు కలిపించాలన్నారు. కౌలు రైతులకు కౌలు రద్దు చేసి పంటనష్టపరిహారం వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు చెల్లించాలన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు కరువు పింఛన్‌ ఇవ్వాలన్నారు. పాడి రైతులకు లీటర్‌కు రూ.10 కరువు బోనస్‌ చెల్లించాలన్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారందరికీ బియ్యం, కందిపప్పు, గోధములు, చెక్కెర, మంచినూనె, వంటి 14 రకాల నిత్యావసర సరుకులు చౌకడిపోద్వారా అందించాలన్నారు. రెవెన్యూ గ్రామాల్లో పశుగ్రాసకేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లు, ప్రభుత్వ కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేయాలని కోరారు.

➡️