సమావేశంలో మాట్లాడుతున్న రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరిమల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక గణేనాయక్ భవన్‌లోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. వీటని నిరసిస్తూ ఈనెల 17న విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసిందని, రబీ సీజన్లో కూడా సగం కాలం గడిచిందన్నారు. అయినా పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నారు. కరువుకు గురైన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. ఉచిత పంటల బీమా రద్దు చేసి రైతుల ప్రీమియం రైతులే చెల్లించాలని జీవో ఇచ్చిందన్నారు. దీని వల్ల లక్షలాది మంది రైతులు బీమా కట్టలేక ఉండిపోయారని తెలిపారు. 2023 ఖరీఫ్ రబీ ఇన్సూరెన్స్ ప్రకటించాలన్నారు. హంద్రీనీవా కాలువకు సంబంధించి 404,405, జీవో రద్దు చేయాలన్నారు. డ్రిప్పు స్పింక్లర్లు 10 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి శివారెడ్డి, ఎన్.మధుసూదన్, రాజారాం రెడ్డి, బిహెచ్.రాయుడు, పోతలయ్య, వెంకట్ నాయుడు, నారాయణరెడ్డి, ఈరప్ప, నాగమ్మ, చిదంబరమ్మ, సువర్ణమ్మ, వలీ, కొండారెడ్డి, శ్రీనివాసులు, మద్దిలేటి పాల్గొన్నారు.