విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత
ప్రజాశక్తి-అనంతపురం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థపాలనను ప్రశ్నిస్తున్న వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడుతూ అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తుంటే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్‌కళ్యాన్ మాట్లాడిన వీడియోలతో సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే గొంతునొక్కుతున్నారని విమర్శించారు. చివరకు ఏ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారో కూడా తెలియజేయడం లేదన్నారు. ఇటీవల అనంతపురం పర్యటన సందర్భంగా డిజిపి తిరుమలరావు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉందన్నారు. ఐఎఎస్, ఐపిఎస్‌లు మాట వినకుంటే సస్పెండ్ చేయడమో, బదిలీ చేయడమో చేస్తున్నారని తెలిపారు. ముమ్మాటికీ ఐపిఎస్‌లు, ఐఎఎస్‌లను బ్లాక్‌మెయిల్ చేయడమేనన్నారు. ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలను పెంచేది లేదని, అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రూ.17వేల కోట్ల భారం వేస్తున్నారు. ఎక్కడికక్కడ టిడిపి నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. వీటన్నింటినీ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే పోలీసులు అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు తాము చెప్పినట్లు నడుచుకోవడం లేదని కేబినెట్ సమావేశంలో చర్చించడం సిగ్గుచేటన్నారు. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాయకులు పార్టీ శ్రేణులకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే పోలీస్‌స్టేషన్లకు వెళ్లి అక్రమ కేసులపై ప్రశ్నించాలన్నారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లిలో వైసీపీ కార్యకర్త సంజీవరెడ్డిని బుధవారం అరెస్టు చేశారని, ఆరా తీస్తే పుట్టపర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందన్నారు. అక్కడి డీఎస్పీతో తాను మాట్లాడితే తమ వద్ద లేడని అంటున్నారన్నరు. రాష్ట్ర డీజీపీ, సీఎస్‌లకు పరిపాలనలో అనుభవం ఉందని, మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారనిన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని సూచించారు. అధికారులు మాత్రమే శాశ్వతమని, రాజకీయ నాయకులు కాదన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారొద్దని తెలిపారు. ఏ వైసిపి నాయకుడు, కార్యకర్త కూడా అధైర్యపడొద్దని అధినేత జగన్ తమకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.