వినతిపత్రం అందిస్తున్న రైతుసంఘం, పండ్లతోటల సంఘం నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
నిరంతరం కరువుకు గురవుతున్న జిల్లా రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లను రైతులకు 90 శాతం రాయితీతో ఇవ్వాలని పండ్లతోటల రైతుసంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నగరంలోని ఎపిఎంఐపి పీడీ, ఉద్యానశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, పదెకరాల లోపు ఉన్న రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పాత పండ్లతోటల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని, అన్నిరకాల పండ్ల మొక్కలను 90 శాతం రాయితీతో ఇవ్వాలని, పండ్లతోటల రైతు రుణాల మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు, పండ్లతోటల రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.మధుసూదన్, సహాయ కార్యదర్శి చెన్నారెడ్డి, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజారామిరెడ్డి, బిహెచ్.రాయుడు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోతలయ్య కె.శ్రీనివాసులు, వి.కొండారెడ్డి, రమేష్, చిదంబరమ్మ, నాగమ్మ పాల్గొన్నారు.