విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలి

డిఇఒకు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ప్రభుత్వ నిబం ధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేపట్టిన ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలను అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్‌, జిల్లా అధ్యక్షులు సిద్ధు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం స్థానిక కార్యాలయంలో డిఇఒ సుధాకర్‌బాబుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని నారాయణ, శ్రైచైతన్య విద్యాసంస్థలు 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే ఇంటర్‌ కోసం ముందస్తు అడ్మిషన్లు చేపట్టడం బాధాకరమన్నారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థులు పరీక్షలపై శ్రద్ధ చూపకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదన్నారు. అంతేగాకుండా ముందస్తు అడ్మిషన్ల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.5,500 నుంచి రూ.10,500 వరకూ వసూళ్లు చేస్తున్నారన్నారు. వెంటనే ముందుస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ రజిత, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాగభూషణ్‌, వీరాంజనేయులు, సాయి, చంద్రశేఖర్‌, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️