రాజ్యాంగంతో అందరికీ సమాన హక్కులు

అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

రాజ్యాంగం దేశంలో అందరికీ సమాన హక్కులను ప్రసాదించిందని కలెక్టర్‌ డా||వి.వినోద్‌ కుమార్‌ తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ చిత్ర పటానికి కలెక్టర్‌, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని పీఠిక ఒక పవిత్ర గ్రంథం అన్నారు. దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ, ఆనందంగా ఉన్నామంటే అది రాజ్యంగం ద్వారనే అన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఒక కులం, తెగ, వర్గం, ఒక ప్రాంతం అనికాకుండా అందరికీ వర్తించే విధంగా రాజ్యాంగం హక్కులను కల్పించిందన్నారు. అనంతరం అధికారులతో రాజ్యాంగ ప్రవేశికతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఏ.మలోల, డిపిఎం ఆనంద్‌, కలెక్టర్‌ కార్యాలయం ఎఒ అలెగ్జాండర్‌, కలెక్టరేట్‌ కోఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ యుగేశ్వరి, ఈ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రియాజుద్దీన్‌, జిల్లా టూరిజం అధికారి జయ కుమార్‌ బాబు, ఐఅండ్‌పిఆర్‌ డిఐపిఆర్‌ఒ పి.గురుస్వామి శెట్టి పాల్గొన్నారు.

➡️