ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర : మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌

ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

           ఉరవకొండ : ‘ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా నేటి పాలకుల చర్యలు ఉన్నాయి. శాస్త్రీ విద్యా విధానం అందించి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సి ఉండగా, విద్యలో కాషాయీకరణ జొప్పించి విద్యార్థులను మతోన్మాద శక్తులుగా మార్చే కుట్ర జరుగుతోంది. ఇలాంటి వాటిని విద్యార్థులు ఐక్యంగా తిప్పికొట్టాలి’ అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఉరవకొండలో ఎస్‌ఎఫ్‌ఐ 32వ జిల్లా మహాసభలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. మహాసభల ప్రారంభం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులతో కలిసి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో గేయానంద్‌ ప్రసంగించారు. బోధనలో శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయకుండా కొన్ని పాలక పార్టీలు చరిత్రను వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను కాషాయీకరణ చేస్తూ విద్యార్థులను మతోన్మాద శక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రయివేటీకరణ చేస్తూ కార్పొరేట్లకు విద్యారంగాన్ని అప్పజెప్పే కుట్ర జరుగుతోందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు దేశ విదేశాల్లో జరుగుతున్న అనేక అంశాలను పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు. దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా ఉండాలని, సమసమాజ నిర్మాణం జరగాలని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు. ప్రస్తుతం కొంతమంది పాలకులు అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నిత్యం కరువు కాటకాలకు గురవుతున్న అనంతపురం జిల్లాలో పేద విద్యార్థుల విద్యాభివద్ధికి ప్రభుత్వాలు కషి చేయాలన్నారు. జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. హాస్టళ్లలో వసతులు పెంచాలన్నారు. ప్రతి తరగతికీ ఒక గది, ప్రతి సబ్జెక్టుకూ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బంగి శివ, ఓతూరు పరమేష్‌ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గహాల్లో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్‌ ఛార్జీలను విడుదల చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్‌ భవనాలకు మరమ్మతులు చేయాలని కోరారు. 117, 77 జీవోలను రద్దు చేయాలన్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. నీట్‌ పరీక్షను రద్దుచేసి నీట్‌ స్కాంకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీ, గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధూతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️