అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న రైతు జి.మల్లికార్జున (ఫైల్‌ ఫొటో)

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యలకుంటపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన జి.మల్లికార్జున(45)కు కెకె.అగ్రహారం గ్రామంలో 3.50 ఎకరాల భూమి ఉంది. ఇందులో బోర్లు వేయించి, వివిధ రకాల పంటలు సాగు చేసేవాడు. పంటల సాగు, బోర్లు వేసేందుకు దాదాపు రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. గత నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో పంటలు చేతికందకపోవడంతో అప్పులు తీర్చడం కష్టం అయ్యింది. ఈ మనస్తాపంతో బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉజీ మాత్రలు మింగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం బుక్కరాయమసుద్రం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య వరలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️