రైతులు డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలి

డ్రోన్‌పై అవగాహన కల్పిస్తున్న కంపెనీ ప్రతినిధులు

ప్రజాశక్తి-శింగనమల

రైతులు డ్రోన్లను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ చౌదరి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెరవలి గ్రామంలో వియోమిక్స్‌ డ్రోన్స్‌ కంపెనీ ప్రతినిధులు డ్రోన్స్‌ ద్వారా పొలాల్లో స్ప్రేయింగ్‌ చేయడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో క్రిమి సంహారక మందుల పిచికారీ కోసం డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా సమయం తో పాటు ఖర్చులు, పురుగు మందులు తక్కువ అవుతాయన్నారు. తద్వారా రైతుకు అధిక దిగుబడులు సాధించి లాభాలు గడిస్తారన్నారు. ఇకపోతే వియోమిక్స్‌ డ్రోన్స్‌ కంపెనీ ప్రతినిధులు దాదాపు 100మంది యువకులకు 15 రోజుల పాటు డ్రోన్ల ఆపరేషన్‌ పై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం సతోషకరమన్నారు. గ్రామ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిదానంద నాయుడు, మారుతీనాయుడు, పుచ్చకాయల రాము, సర్పంచ్‌ రాజు, నాయకులు పోకూరి శ్రీనివాసులు, సాదిక్‌ వలి, నాగరాజు, డ్రోన్స్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

➡️