విలేకరులతో మాట్లాడుతున్న నాగమణి
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
అతివృష్టి, అనావృష్టి కారణంగా జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని గణేనాయక్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములు, ఇళ్లస్థలాల సమస్యలకు పట్టాలు, పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. అలాగే 2023 ఖరీఫ్ పంటల బీమా, 2024లో జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఖరీఫ్ పంట నష్టపరిహారం, బీమా ఇవ్వాలన్నారు. 2024 రబీ పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని, సిసిఆర్‌సి కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ, ఆలయం భూముల సాగు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇవ్వాలని, పంట నష్ట పరిహారం, పంటల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకపోతే కేరళ రాష్ట్రంలో సర్వం కోల్పోయిన వయనాడు వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలపై చర్చిందుకే ఈనెల 11వతేదీన నగరంలోని జెవివి కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో మేథావులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.