సమాజ మార్పునకు పూలే శ్రీకారం

పూలేకు నివాళులు అర్పిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

మహాత్మా జ్యోతిబా పూలే సమాజా మార్పునకు శ్రీకారం చుట్టిన మహనీయుడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ కొనియాడారు. పూలే 134వ వర్థంతి సందర్భంగా గురువారం నాడు అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ మేయర్‌ వసీం, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీఎస్‌ఆర్టీసీ కడప రీజినల్‌ ఛైర్మన్‌ పూల నాగరాజు, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్యతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్‌ మాట్లాడుతూ సమాజంలో మార్పు తెచ్చిన, స్ఫూర్తి నింపిన వ్యక్తులను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. అణగారిన వర్గాలను సమాజంలో వేరుచేసి చూస్తున్న రోజుల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే దానికి వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. అందరూ సమానమే అన్న నినానందో సమాజా మార్పునకు శ్రీకారం చుట్టిన మహనీయుడు జ్యోతిబా పూలే అన్నారు. ప్రతి ఒక్కరూ జ్యోతిబా పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో సామాజిక అంతరాలు తొలగించేందుకు దేశంలో మొట్ట మొదటిసారి ప్రయత్నం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అన్నారు. మహిళల చదువును వ్యతిరేకించే ఆ రోజుల్లోనే పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేని దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మార్చి మహిళల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో ఎ.మాలోల, బీసీ వెల్ఫేర్‌ డిడి కుష్బు కొఠారి తదితరులు పాల్గొన్నారు.

➡️