వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి రూ.7000 వేల కోట్లు నిధులు కేటాయించాలని సిపిఎం నాయకులు మంత్రి టిజి.భరత్‌ను కోరారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్‌ఛార్జి మంత్రిని సిపిఎం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, బాలరంగయ్య, ఎస్.నాగేంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లా నీటి వనరుల అభివద్ధి కోసం ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఇనుము, ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సురెన్సు ఇవ్వాలన్నారు. 2023 ఖరీఫ్, రబీ పంటల బీమా ప్రకటించాలని కోరారు. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. తుంగభద్ర డ్యామ్‌కు గేట్లు వేయాలని, ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపి కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. ఉంతకల్లు జలాశయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అందుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ జీడిపల్లి నుంచి మొదలుపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తూ పరిసర గ్రామాలకు తాగునీరు అందించడానికి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలన్నారు. పీఏబీఆర్ కుడికాలువ పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని, సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాలని కోరారు. జిల్లాలోని చెరువులు, కుంటలను నీటిపారుదల కాలువలతో అనుసంధానం చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో తాగునీటి పథకాలను పూర్తి చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్.చంద్రవేఖర్‌రెడ్డి, ఆర్‌వి.నాయుడు, టి.రామాంజినేయులు పాల్గొన్నారు.