రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి-ఉరవకొండ
హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జె.మల్లికార్జున అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ పనుల లైనింగ్ కాకుండా వెడల్పు చేసి జిల్లాకు అదనంగా నీరు తీసుకురావాలన్నారు. కాలువ డిస్ట్రిబ్యూటరీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హంద్రీనీవా ద్వారా జిబిసి బ్రాంచి కెనాల్‌కు అధికారికంగా సాగునీరు విడుదల చేయాలన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి నికరజలాలు వాడుకోవడానికి హెచ్‌ఎల్‌సి కాలువను ఆధునీకరణ చేసే పనులు చేపట్టాలన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి పిఎబిఆర్ జలాశయానికి 11 టిఎంసిల నికరజలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని పిఎబిఆర్ జలాశయం కుడి, ఎడమ ద్వారా మిడ్‌పెన్నార్, జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా 55వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, అబ్బాస్, సిపిఐ నాయకులు సుల్తాన్, గన్నే మల్లేష్, పురిడి తిప్పయ్య, మురళి, రవి, రామాంజనేయులు, దేవేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మలరాయుడు, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, జమీర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.