సమస్యలు పరిష్కరించకుంటే ‘కౌన్సిల్‌’ను అడ్డుకుంటాం

మున్సిపల్‌ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌

అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 17వతేదీన నిర్వహించనున్న కౌన్సిల్‌ సమావేశాన్ని అడ్డుకుంటామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. గురువారం నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్రకుమార్‌, నగర ప్రధాన కార్యదర్శులు మూర్తుజా, వెంకటనారాయణ, మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణ, ఇంజినీరింగ్‌ సెక్షన్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు ఓబుళపతి, మురళీ మాట్లాడుతూ రెగ్యులర్‌ కార్మికులకు మూడేళ్లుగా బకాయి ఉన్న సలెండర్‌ లీవ్‌ అమౌంట్‌ ఇవ్వాలని, జిపిఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని, జీవో నెంబర్‌ 36 ప్రకారం రూ.21వేల వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సాంకేతిక లోపాల పేరుతో మూడేళ్లుగా 28 మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పడలేదన్నారు. వీరికి జనరల్‌ పండ్స్‌ నుంచి వేతనాలు ఇచ్చి, తర్వాత జీతాలు పడిన వెంటనే రికవరీ చేసుకుంటామని అధికారులు, పాలకవర్గం చెప్పారుగానీ, ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించి పని భద్రత కల్పించాలని, పెరిగిన నగర విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, కార్మికులకు ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐల్లో ఉన్న తప్పులను సవరించి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించి, ఎక్స్‌గ్రేసియా, డెత్‌ బెనిపిట్స్‌ ఇప్పించాలని కోరారు. కార్మికులకు పనిముట్లు, రక్షణ పరికరాలను సకాలంలో అందజేయాలన్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో కౌన్సిల్‌ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు 2వ నగర అధ్యక్షులు గురురాజు, ఇంజినీరింగ్‌ సెక్షన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు సంజీవరాయుడు, నగర కోశాధికారి పోతలయ్య, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, కోశాధికారి బత్తల ఆదినారాయణ, నగర కార్యదర్శి సాకే తిరుమలేష్‌, ఉపాధ్యక్షులు శేషేంద్రకుమార్‌, అనుబంధ సంఘం నాయకులు వెంకటేష్‌, ముత్తురాజు, నగర కమిటీ సభ్యులు పుల్లన్న, శ్రీనివాసమూర్తి, నాగేంద్ర, మరియమ్మ, రాఘవేంద్రప్రసాద్‌, అక్కులప్ప,పెన్నోబిలేసు, ఎం.ఆదినారాయణ, హిమంబి, కుమార్‌, రవి, ఇంజినీరింగ్‌ సెక్షన్‌ కమిటీ సభ్యులు లక్ష్మీదేవి, కార్మికులు పాల్గొన్నారు.

➡️