క్యాన్సర్‌ను సమిష్టిగా ఎదుర్కొందాం

క్యాన్సర్‌ను సమిష్టిగా ఎదుర్కొందాం

క్యాన్సర్‌ను సమిష్టిగా ఎదుర్కొందాం

ప్రజాశక్తి-అనంతపురం

ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్‌ మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత చాలా అవసరమని సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ జిఎంఎన్‌.ఉన్నతి పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తితో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. క్యాన్సర్‌ చికిత్సలో వ్యాధిని ముందుగా గుర్తించడం, తగిన సమయంలో చికిత్స తీసుకోవడం, మానసిక ప్రేరణ అనేది చాలా అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మందికిపైగా క్యాన్సర్‌తో మరణిస్తున్నారన్నారు. అంతేగాకుండా మరణాల జాబితాలో క్యాన్సర్‌ రెండవ ప్రధాన కారణం వర్ధమాన దేశాలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దేశాల్లో పది మరణాల్లో ఏడు మరణాలు క్యాన్సర్‌ కారణంగా సంభవిస్తున్నాయన్నారు. శరీరంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్‌ సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవన్నారు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయన్నారు. కొన్ని రకాల క్యాన్సర్లనూ ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదన్నారు. క్యాన్సర్‌ అంటువ్యాధి కాదనీ, అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే నన్నారు. అయితే రొమ్ము, థైరాయిడ్‌, పెద్దపేగు, పాంక్రియాస్‌ క్యాన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయన్నారు. కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్లు వస్తే వచ్చే ప్రమాదం ఉందన్నారు. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించకపోతే ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవన్నారు. కాబట్టి దీనిపై అవగాహనతో ఎదుర్కొవాలన్నారు. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చన్నారు. వీటిలో ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం హెచ్‌పివి వైరస్‌ అన్నారు. దీనికి వ్యాక్సిన్‌ వేసుకుని నివారించవచ్చన్నారు. 9ఏళ్లు పైబడిన బాలికల నుంచి 40 ఏళ్ల మహిళల వరకూ ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చన్నా. అలాగే అండాశయం, గొంతు క్యాన్సర్‌ రాకుండా కూడా ఇది అడ్డుకుంటుందన్నారు. క్యాన్సర్‌ను జయించడం, త్వరగా గుర్తించడంతో పాటు ఆ కణితులు పరిమాణం, దశ, గ్రేడింగ్‌ కూడా చాలా ముఖ్యమ్నారు. కాన్సర్‌కు వయసుతో సంబంధం లేదనీ అన్ని వయసుల వారూ దీని బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. కానీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లను చాలా వరకూ పూర్తిగా నయం చేయగలిగేవే అన్నారు. అయితే, వయస్సు పెరిగేకొద్దీ క్యాన్సర్స్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేయడానికి కీమోథెరఫీ, రేడియోథెరఫీలతో పాటు ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో చేసే కీహౌల్‌ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. సర్జరీ తర్వాత రేడియో, కీమో, హార్మోన్‌థెరపీ లాంటివి చేసినా, లేక థెరఫీల తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదన్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

➡️