మురుగు కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రసాద్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
అనంతపురం నగరంలోని నడిమివంక, మరవవంక పరిసర కాలనీలను మరోసారి నీట మునగనివ్వమని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలియజేశారు. మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన 48వ డివిజన్‌లో పర్యటించారు. సోమనాథ్ నగర్, ఆర్‌కె.నగర్, రజక్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. డ్రెయినేజీ, వీధి దీపాల సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భారీ వర్షాల సమయంలో నడిమివంక నుంచి నీరు ఇళ్లలోకి వస్తోందని, దీనివల్ల చాలాసార్లు నష్టపోయామని తెలిపారు. వీటిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే నడిమివంక, మరవవంక కాలువలకు రిటైనింగ్ వాల్‌తో పాటు డ్రెయినేజీల ఎత్తు పెంచే విధంగా 124 కోట్లతో అంచనాలు వేసినట్లు తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. పార్కుల అభివద్ధికి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, టిఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం నాగభూషణ, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దలవాయి వెంకటనారాయణ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, తెలుగుత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీ నరసింహ, టిడిపి నాయకులు నరేంద్ర చౌదరి, శ్రీనివాస్ చౌదరి, కృష్ణ, నాగేంద్ర, కృష్ణారెడ్డి, గుర్రప్ప, వాసు, మహేశ్వరి, జావిద్, తనీష్‌తో పాటు జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.