మున్సిపల్‌ కార్మికురాలికి తప్పిన ప్రమాదం

మున్సిపల్‌ కార్మికురాలికి తప్పిన ప్రమాదం

ఎస్‌టిపి వద్ద ప్రమాదానికి గురైన ప్రమీలను కాపాడుతున్న కార్మికురాలు

ప్రజాశక్తి-తాడిపత్రి

తాడిపత్రి మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికురాలు ప్రమీల పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. పట్టణంలోని ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న కార్మికురాలు ప్రమీల జూనియర్‌ ఇంజినీర్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఎస్‌టిపి వన్‌ వద్ద విధులు నిర్వహిస్తోందన్నారు. విధుల్లో భాగంగా అస్వస్థకు గురైన ఆమె ఒక్కసారిగా ఎస్‌టిపి నీటి మడుగులోకి జారి పడిపోయింది. గమణించిన తోటి కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు లాగారు. అస్వస్థతకు గురైన ప్రమీల వాంతులు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిఐటియు నాయకులు జగన్మోహన్‌రెడ్డి, ఉమాగౌడ్‌, ప్రసాద్‌ ఆసుపత్రికి వెళ్లి కార్మికురాలిని పరామర్శించారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ అధికారులు అటువైపు చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సిఐటియు నాయకులు మండిపడ్డారు. కార్మికులపై ఒత్తిడి తెచ్చి ఎస్‌టిపి వద్ద విధులు కేటాయించారన్నారు. దీంతోనే కార్మికురాలు అస్వస్థకు గురై ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాదానికి గురైన ప్రమీలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.

➡️