ఉన్నత ఆశయాలతో జీవించిన వ్యక్తి ఎంవి.రమణ

ఎంవి.రమణ అంతిమయాత్రలో పాల్గొన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

మనిషి జీవించి ఉండగా ప్రజల కోసం పనిచేయడమే కాకుండా ఉన్నతమైన ఆశయాలతో తాను మరణించిన తర్వాత పరోక్షంగా సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో చివరి కోరికగా తాను మరణించిన తర్వాత తన పార్థివ దేహాన్ని మెడికల్‌ కళాశాలకు అందించాలనే ఆశయం చాలా గొప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ తెలియజేశారు. బుధవారం నాడు మరణించిన సిపిఐ సీనియర్‌ నాయకుడు ఎన్‌వి.రమణ అంతిమయాత్రను గురువారం నగరంలో నిర్వహించారు. వామపక్ష, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. రమణ పార్థవదేహాన్ని సిపిఐ కార్యాలయం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు తీసుకుని వచ్చి వైద్యాధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా రామకష్ణ మాట్లాడుతూ ఎన్‌వి.రమణ విద్యార్థి దశ నుంచి మరణించేంతవరకు పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తి అన్నారు. తన తండ్రి కోరికను గౌరవించి ఎంవి.రమణ పార్థివ దేహాన్ని మెడికల్‌ కళాశాలకు అందజేసిన ఆయన కుమారుడు వేణుగోపాల్‌, కోడలు సునీతల మనో ధైర్యాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్‌, పి.రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు కె.రామాంజనేయులు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కార్యదర్శులు సి.జాఫర్‌, ఎం. వేమన్న యాదవ్‌, సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️