కాంట్రాక్టు ఉద్యోగ, కార్మికులపై నిర్లక్ష్యం

కలెక్టరేట్‌ వద్ద ప్రదర్శనగా వస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం కొనసాగుతోందని, ఈ విధానానికి స్వస్తి చెప్పి వారందరినీ రెగ్యులర్‌ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్ర కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకు మునుపు లలితకళా పరిషత్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం. నాగమణి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఓబులు, ఎస్‌.నాగేంద్ర కుమార్‌లు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, నాన్‌ పర్మినెంట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలన్నారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కార్మికులకు డిస్పూట్‌(ఐడి) చట్టప్రకారం 240 రోజులు పనిచేసిన కార్మికులను పర్మిన్మెంట్‌ చేయాలని సుప్రీంకోర్టు, కార్మిక చట్టాల చెబుతున్నాయన్నారు. అయినా కాంట్రాక్టు, డైలీవెజ్‌, కంటింజెంట్‌, అవుట్‌సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, పార్ట్‌టైం, గెస్ట్‌, పీస్‌ రేటు తదితర పేర్లతో నాన్‌ పర్మినెంట్‌ కార్మికులను పని చేయించుకోవడమే కాకుండా, కార్మిక హక్కులను కాలరాస్తున్నా పాలకవర్గాలు ఏమీ ఆలోచించడం లేదన్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎనిమిది నెలలు గడుస్తున్నా వేతనాల అందకపోవడం సిగ్గుచేటు అన్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రీరామ్‌ రెడ్డి, సత్యసాయి వాటర్‌ వర్క్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఎనిమిది నెలలు బకాయి, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 15 నెలలకుపైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వాలు, పాలక ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనాన్ని కేంద్రం, రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన జీవితాలకై పోరాడటం మినహా మరొక మార్గం కనపడటంలేదన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కారం వేదికలో డిఆర్‌ఒను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి టి.గోపాల్‌, ఉపాధ్యక్షులు మన్నెల రామాంజనేయులు, వెంకట నారాయణ, నాయకులు శివప్రసాద్‌, శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనరసమ్మ, ఎం.వరలక్ష్మి, ఎటిఎం నాగరాజ్‌, ఎర్రిస్వామి, తిరుమలేష్‌, శ్రీరామ్‌ రెడ్డి, శ్రీ సత్యసాయి తాగునీటి కార్మిక సంఘం నాయకులు ఎర్రిస్వామి, రాముడు, నేషనల్‌ హెల్త్‌ నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, మెడికల్‌ కాలేజ్‌ నాయకులు ఓబులేష్‌, శేషు, గ్రామపంచాయతీ యూనియన్‌ నాయకులు బాషా, వీరాంజనేయులు, రైతుసంఘం నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, బాల రంగయ్యతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️