బురదమయంగా మారిన నాగిరెడ్డిపల్లి-గుడిపల్లి దారి
ప్రజాశక్తి-బ్రహ్మసముద్రం
పైన కనపడుతోంది బురద కాదు.. దారే.. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ దారి ఇలాగే మారుతుంది.. ఈ దారిలో వెళ్లాలంటే వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే.. ఎక్కడే కాదు.. బ్రహ్మసముద్రం మండలంలోని నాగిరెడ్డిపల్లి నుంచి గుడిపల్లికి వెళ్లే దారి ఇది….
వివరాలోకి వెళ్తే… మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి నుంచి గుడిపల్లికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలయమంగా మారింది. నాగిరెడ్డిపల్లి నుంచి ముద్దులాపురం, గుడిపల్లి, గుడిపల్లి పైదొడ్డి గ్రామాలకు వెళ్లాంటే ఈ దారిగుండా వెళ్లాల్సిందే. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు నిత్యం తోటలకు, రాయదుర్గం పట్టణానికి వెళ్తూ ఉంటారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డు చిత్తడిమయంగా మారి దారి పూర్తిగా స్తంభించింది. దారంతా బురదతో నిండి ఉంది. దీంతో ఇటుగా వెళాల్సిన ప్రజలు, రైతులు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతుల్లో చేయిస్తే అయినా బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.