ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలకు పునరావాసం కల్పించాలి

ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలకు పునరావాసం కల్పించాలి

మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్‌.రాజు, శ్రావణిశ్రీ

ప్రజాశక్తి-శింగనమల

మండల పరిధిలోని ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజీ కింద పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. ఈమేరకు మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడును గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని ఎస్‌సి వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలని, ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, బుక్కరాయసముద్రంలో అంబేద్కర్‌ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని మిడ్‌పెన్నార్‌ హెచ్‌ఎల్‌సి కెనాల్‌ ఆధునీకరణ, చాగల్లు రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెేజీ కింద పునరావసం కల్పించాలని, గండికోట రిజర్వాయర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోరారు. ఇందుకు ఆయా మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించాలని వినతి

శింగనమల మండలంలోని అలంకరాయునిపేట గ్రామం వద్ద కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించాలని సిఎం చంద్రబాబుతోపాటు మంత్రి నిమ్మల రామానాయుడుకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌.రాజు, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ విన్నవించారు. ఇందులో భాగంగా వర్షాకాలంలో కూతలేరు వంక పొంగిన సమయంలో అలంకరాయుని పేట గ్రామస్తులు పడే ఇబ్బందులను వివరించారు. ఇందుకు సిఎం, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

➡️