ఓపీఎస్‌ తప్పా దేన్నీ అంగీకరించం : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

        పాత పెన్షన్‌ పథకం తప్ప మరే పెన్షన్‌ స్కీమ్‌ను అంగీకరించబోమని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్యలు స్పష్టం చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పాత పెన్షన్‌ పెన్షన్‌ పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయకుండా యునైటెడ్‌ పెన్షన్‌ స్కీం (యుపిఎస్‌) పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావడాన్ని యుటిఎఫ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యుపిఎస్‌ నిర్ణయాన్ని నిరశిస్తూ ఆగస్టు 30వ తేదీన జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వాటాతో సంబంధం లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఉండే పాత పెన్షన్‌ కంటే మరేదీ అంగీకారం కాదని తెలిపారు. కార్పొరేట్లు, షేర్‌ మార్కెట్‌ మాయాజాలానికి ఉపయోగపడే సిపిఎస్‌, యుపిఎస్‌ విధానాలను అమలు చేయడం ఆపి, పాత పెన్షన్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు రమణయ్య, సహాధ్యక్షులు సరళ, రామప్ప, కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్‌ ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శులు ప్రమీల, హనుమంత్‌ రెడ్డి, అర్జున్‌, రవికుమార్‌, సంజీవ్‌ కుమార్‌, అబ్దుల్‌ వహాబ్‌, రఘురామయ్య, శేఖర్జి, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

➡️