సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ జగదీష్
ప్రజాశక్తి-అనంతపురం క్రైం
పోలీసులు విధులు పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. సోమవారం నాడు జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని ఎస్‌ఐలు, ఆపైస్థాయి పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రేవ్ కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలుండాలన్నారు. ప్రతీ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జిడిలు తప్పనిసరిగా రాయాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో చిన్న సమస్యలు సైతం తలెత్తకుండా అప్రమత్తంగా పని చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సిసి కెమెరాల సేవలు చాలా కీలకమన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు, రవికుమార్, శ్రీనివాస్, రామకృష్ణుడు, ఎస్.మహబూబ్ బాషాతో పాటు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. పలువురికి ప్రశంసా పత్రాలుగత నెలలో జిల్లా వ్యాప్తంగా మంచి పని తీరు కనపరిచిన 46 మంది పోలీసులను ఎస్పీ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. నిందితులను సకాలంలో కోర్టు ముందు హాజరు పరిచి రెండు జీవిత కాలాల శిక్షలు పడేలా కృషి చేయడం ఇతర కేసుల్లో పురోగతి చూపిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. సిఐలు ఇస్మాయిల్, సాయినాథ్, శాంతిలాల్, ప్రతాప్ రెడ్డి, షేక్ జాకీర్, ఎస్‌ఐలు నాగమధు, సాగర్, గౌస్ మహమ్మద్ బాషా, పవన్ కుమార్, రాజశేఖర్ రెడ్డితో పాటు ఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు వీటిని అందించారు.