సంతమార్కెట్‌ వేలంపాట వాయిదా

వేలం పాట నిర్వహిస్తున్న అధికారులు

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌

అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో దినసరి సంత మార్కెట్‌ టెండర్‌ వేలంపాట అధికారుల వింత ధోరణితో ప్రహసనంగా మారింది. వేలంపాట ప్రారంభం సమయంలో గడచిన మూడేళ్లుగా దినసరి సంత మార్కెట్‌ టెండర్‌ను దక్కించుకున్న విజరుకుమార్‌ సుంకం వసూళ్లలో ఎదురయ్యే సమస్యలను డిప్యూటీ కమిషనర్‌ మిటికేరి వెంకటేశులు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ఆయన కోరారు. సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పాల్సిన డిప్యూటీ కమిషనర్‌ అది తనకు తెలియదని, కమిషనర్‌కు చెప్పాలంటూ సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో వేలంపాటను నిలిపేసి టెండర్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పోటాపోటీగా మటన్‌మార్కెట్‌ వేలం

           మటన్‌ మార్కెట్‌ వేలంపాటను సర్కారు సవాల్‌ రూ.5.10లక్షలతో ప్రారంభించారు. కాంట్రాక్టర్లు హలీం సిద్దయ్య, చంద్రశేఖర్‌, సుబ్బయ్యలు పోటాపోటీగా వేలంలో ధరను పెంచారు. 6.80లక్షలతో మటన్‌ మార్కెట్‌ను కాంట్రాక్టర్‌ హలీం దక్కించుకున్నాడు. టెండర్‌ దక్కించుకున్న తర్వాత కాంట్రాక్టర్‌ హలీం డిప్యూటీ కమిషనర్‌తో సుంకం వసూలుపై మాట్లాడారు. సుంకం వసూలు సమయంలో తనకు బెదిరింపులు వస్తే వారి నుంచి అధికారులు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ టెండర్‌లో పాల్గొని సుంకం వసూలు దక్కించుకున్న తర్వాత ధైర్యంగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటూ సలహా ఇచ్చారు.

వేలం పాటలో దరఖాస్తు చేసుకోని వారు..!

         దినసరి సంత మార్కెట్‌ వేలంపాట ప్రారంభానికి ముందు అర్బన్‌ ఎమ్మెల్యే అనుచర వర్గం, మరో ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు వచ్చారు. టెండర్‌లో వేలంపాట పాడేందుకు దరఖాస్తు చేసిన వారే ఉండాలని, ఇతరులు బయటికి వెళ్లాలని గుమాస్తా నారాయణస్వామి మైక్‌లో చెప్పారు. కాంట్రాక్టర్లు ఆ మాటలను బేఖాతర్‌ చేస్తూ అక్కడే కూర్చొన్నారు. ఈ విషయాన్ని గట్టిగా చెప్పాలని డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశులు రెవెన్యూ ఆఫీసర్లు విజరు కుమార్‌, వెంకటేశులును ఆదేశించారు. అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎటూ చెప్పకుండా మౌనం దాల్చారు. ఎమ్మెల్యే అనుచర వర్గం ఐదుగురు వేలం పాట నిర్వహించే గదిలోనూ కూర్చొన్నారు.

➡️