ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి
ప్రతిపక్షంలో ఉండగా సామాన్యులకు అండగా ఉంటామని హామీలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే వాటికి తిలోదకాలిచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నా భోజన ఏజెన్సీలను ఏకపక్షంగా రద్దు చేసి తమ వారికిస్తున్నారన్న ఆరోపణలు నెలకొన్నాయి. అధికారంలోకి వచ్చిన 40 రోజుల వ్యవధిలోనే పావు వంతు మధ్యాహ్నా భోజన ఏజెన్సీలను రద్దు చేసింది. ఇందులో నిబంధనలు కూడా పాటించకుండానే తొలగించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టిడిపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా ఉపాధి లభించే వాటిపై టిడిపి శ్రేణులు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్, యానిమేటర్, మధ్యాహ్న భోజన ఏజెన్సీ తదితర వాటిని దక్కించుకునే ప్రయత్నాలు ఆరంభించారు. ఇందులో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహులు పాత వారిని మార్చేసి టిడిపి మద్దతుదారులకు అప్పగించే ప్రయత్నం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇప్పటికే చాలా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలను లాగేసుకున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 1640 మధ్యాహ్నా భోజన ఏజెన్సీలు నడుస్తున్నాయి. మధ్యాహ్నా భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నాం భోజనం వండిపెట్టే పనిని వీరు చేస్తారు. 2003 నుంచి వీరు పనిచేస్తూ వస్తున్నారు. అటువంటి వారిని కూడా ఇప్పుడు తొలగించేశారు. టిడిపి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక తమవారికివ్వాలి కాబట్టి తప్పుకోవాలని స్థానిక నాయకులు ఏజెన్సీ నిర్వాహకులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. దీంతో అధికారులు ఉన్న వారిని కాదని కొత్తవారికి ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు చెప్పడంతో నిర్వాహకులకు దిక్కుతోచడం లేదు. ఉన్నఫలంగా ఉపాధి కోల్పోతుండటంతో తమ బాధ ఎవరితో చెప్పుకోవవాలో పాలుపోని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలోని 32 మండలాల్లో కలిపి సుమారు 400 మధ్యాహ్నా భోజన ఏజెన్సీలను మార్చేశారు.
నిబంధనలకు తిలోదకాలు
మధ్యాహ్నా భోజన ఏజెన్సీని మార్చాలంటే కొన్ని నిబంధనలున్నాయి. వాటిని ఏ మాత్రం పాటించడం లేదు. సరిగా భోజనం లేకపోతే ముందుగా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. మూడు నోటీసుల తరువాత కూడా తప్పులు జరిగితే అప్పుడు పాఠశాల యాజమాన్య కమిటీలో నిర్ణయం చేసి ఉన్నతాధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాతవారిని తొలగించి కొత్త వారికివ్వాల్సి ఉంటుంది. ఇవేవీ పాటించకుండానే ఏకపక్షంగా ఏజెన్సీలను రద్దు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులేమి పట్టనట్టు ఉన్నారు. అధికారపార్టీ నేతలు ఆదేశాలకు అనుగుణంగా పై మార్గదర్శకాలేవి పాటించకుండానే నేరుగా పాతవారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు ఇస్తుండటం గమనార్హం.