పత్తిని పరిశీలిస్తున్న చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత
ప్రజాశక్తి-పెద్దవడుగూరు
దేశీయ పత్తి పంటను జిల్లాలో పెద్దఎత్తున సాగుచేయాలని, ప్రకతి వ్యవసాయం ద్వారా సురక్ష, సూరజ్ అనే రెండు రకాల పత్తి పంటలు సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు తగిగన ప్రోత్సాహం ఇవ్వాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.సునీత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ పరిధిలో ప్రకతి వ్యవసాయం ద్వారా సాగుచేసిన దేశీయ పత్తి పంట పొలాలను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతు సుంకమ్మ, వెంకట్ రెడ్డి, ఎస్తేర్ రాణి పత్తి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.సునీత మాట్లాడుతూ దేశీయ పత్తి రకాలైన సురక్ష, సూరజ్ అనే రెండు రకాల పత్తి పంటలు సాగు చేయడం జరగగా, హైబ్రిడ్ బిటి పత్తి విత్తనాల కంటే దేశీయ పత్తి రకాల సాగు వల్ల 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి ఎక్కువ వస్తుందన్నారు. అంతర్ పంటలుగా జొన్న, కంది, సజ్జ, ఆకుకూరలు, గోంగూర, తదితర పంటలు సాగు చేయవచ్చన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అధిక దిగుబడిని ఇచ్చి ప్రకతి వైపరీత్యాలను తట్టుకునే దేశీయ పత్తి రకాలైన సురక్ష, సూరజ్ పత్తి రకాలను అధికంగా సాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, ప్రకతి వ్యవసాయం సిటిఐఒ, డీపీఎం లక్ష్మనాయక్, తహశీల్దార్ ఉషారాణి, వ్యవసాయ అధికారి మల్లేశ్వరి, బెటర్ కాటన్ ప్రోడక్ట్ డైరెక్టర్ దినేష్ రెడ్డి పాల్గొన్నారు.