బొమ్మనహాల్ మండలంలో నేలకొరిగిన వరిపంట
ప్రజాశక్తి-అనంతపురం
అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కూడేరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బొమ్మనహాల్ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామంలో పిడుగుపాటుతో పది గొర్రెలు మరణించాయి. బొమ్మనహాల్‌లో వరి, రాయదుర్గం మండలంలో మొక్కజొన్న పంటలు ఈదురుగాలులకు నేలవాలాయి.
పిడుగు పాటుతో 10 గొర్రెలు…
గార్లదిన్నె : మండల పరిధిలోని పెనకచెర్ల గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగు పడి పది గొర్రెలు మరణించాయి. చిదంబరప్ప, సుబ్బరాయుడుకు చెందిన గొర్రెలను ఎస్సీ కాలనీ వద్ద మేపుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఇదే సమయంలో పిడుగు పడడంతో అక్కడే ఉన్న పది గొర్రెలు మరణించాయి. దాదాపు రూ.2లక్షలు నష్టం వాటిల్లిందని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు మరణించిన విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు డాక్టర్ రమేష్, ఆంజనేయులు నాయక్ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. నష్టం నివేదికను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.
నేలకొరిగిన వరిపంట
బొమ్మనహాల్ : మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసన వర్షానికి వరిపంట నేలకొరిగింది. గోవిందవాడ, శ్రీధర్‌గట్ట, గోనెహాల్, లింగదహాల్, కొలగనల్లి, మైలాపురం ఉద్దేహాల్ గ్రామాల్లో వరిపంట నేలవాలింది. చేతికందే సమయంలో పంట మొత్తం ఇలా దెబ్బదినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మొక్కజొన్న రైతుకు నష్టం
రాయదుర్గం రూరల్ : మండల పరిధిలోని రాయంపల్లి, కదరంపల్లి, ఆవులదట్ల గ్రామాల్లో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఈదురుగాల దెబ్బకు ఈ గ్రామంలోని మొక్కజొన్న కంకులు నేలవాలాయి.