లక్ష రూపాయల సాయం చెక్కును మృతుని భార్యకు అందిస్తున్న జాయింట్ కలెక్టర్
ప్రజాశక్తి-పామిడి
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు సూర్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయాన్ని అందించారు. బుధవారం నాడు బాధిత కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణశర్మ పామిడి పట్టణంలో పరామర్శించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. కుటుంబ విభేదాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న భూమి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతబాబు, పామిడి తహశీల్దార్ శ్రీధర్ మూర్తి పాల్గొన్నారు.