ముగ్గుల పోటీలో ఉన్న మెడికోలు
ప్రజాశక్తి-అనంతపురం
యువత సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకూడదని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎస్.మాణిక్యరావు సూచించారు. నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం మెడికల్ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి రంగోలి పోటీలు నిర్వహించారు. మెడికోలు సంప్రదాయ వేషధారణలో వచ్చి ముగ్గులు వేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు చదువుతో పాటు దేశ, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో పాటు వారిలో ఉన్న కళా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, ఆచార్య డాక్టర్ తెలుగు మధుసూదన్, ఆచార్య డాక్టర్ కెఎల్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కెవి చలపతి, సీనియర్ డాక్టర్లు డాక్టర్ ఎంఎస్ ప్రసాద్, డాక్టర్ విజయ కుమారి, డాక్టర్ సుమన గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.