పోస్టర్లను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ప్రజాశక్తి-ఉరవకొండ
విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని ఈనెల 15న విజయవాడలో చేపట్టనున్న దీక్షలను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఉరవకొండ మండల అధ్యక్షులు నందు పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం పట్టణంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వంలో గతంలో చలో విజయవాడ నిర్వహించే క్రమంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి నెలరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే మూడు నెలలు కావస్తున్నా పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. కావున వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షల్లో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు తరుణ్, ఎర్రిస్వామి, భాస్కర్, వంశీ, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.