నేటి నుంచి సామాజిక చైతన్యయాత్రలు

విలేకరులతో మాట్లాడుతున్న ఐద్వా, కెవిపిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

మహాత్మా జ్యోతిబా పూలే, బాబా సాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌లు కలలుగన్న సామాజిక న్యాయం, సమసమాజాన్ని సాధించుకోవడానికి మహనీయులను స్మరించుకోవడంతో పాటు చైతన్యం పొందుదామని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి తెలిపారు. గురువారం సంయుక్త సంఘాల ఆధ్వర్యంలో గణేనాయక్‌ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయులను స్మరించుకుని వారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధించుకోవాలన్నారు. అందులో భాగంగా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాడు అనంతపురం జిల్లా పరిషత్‌ హాల్‌ నుంచి సామాజిక చైతన్య యాత్రను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ సభకు ఎస్‌కెయు ప్రొఫెసర్‌ లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి జాతను ప్రారంభిస్తారని తెలిపారు. 14న సాయంత్రం ఐదు గంటలకు అంబేద్కర్‌ నగర్‌, నాగుల కట్ట హై స్కూల్‌ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత, గిరిజన కాలనీల్లో సదుపాయాలు కల్పించాలన్నారు. భూమి లేని వారికి కనీసం మూడు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. ప్రాథమిక పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వమే నడపాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్లో కనీస సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు జీవ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ రజిత, ఐద్వా జిల్లా కోశాధికారి చంద్రిక, అశ్విని పాల్గొన్నారు.

➡️