విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
అనంతపురం నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు. ఈమేరకు జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్‌ను గురువారం నగరంలోని ఆర్డీటీ అతిథిగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పాఠశాలల్లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీరు సమస్య ఉందన్నారు. అలాగే వసతి గృహాల్లో కూడా సమస్యలు ఉన్నాయన్నారు. ఇందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ సానుకూలంగా స్పందించి ఆయా సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రుద్రంపేటకు రెండు ట్రాన్స్‌ఫార్మర్లు
నగరంలోని రుద్రంపేటకు రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేశారు. గురువారం నగరంలోని రుద్రంపేటలో మీ ఇంటికి-మీఎమ్మెల్యే కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు లో ఓల్టేజ్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదరవుతున్నాయని, వీధి లైట్లు కూడా సరిగా వెలగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెండు ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.